
హైదరాబాద్, వెలుగు: ఆయిల్‌పామ్ ప్లాంటేషన్ పురోగతిని వేగవంతం చేయాలని అధికారులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. మంగళవారం సెక్రటేరియెట్‌లో ఉద్యానశాఖ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. ఆయిల్ పామ్సాగుపై నెలవారీగా సమీక్షలు నిర్వహించాలని తెలిపారు. రైతులకు బిల్లుల చెల్లింపులో జాప్యం జరగకుండా చూడాలని, డిసెంబర్ నాటికి ఆయిల్ పామ్ సాగు లక్ష్యాలను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాల్లో కూరగాయల సాగును పెద్దఎత్తున ప్రోత్సహించాలని సూచించారు. అనంతరం హార్టీక్చర్ డైరెక్టర్ యాస్మిన్ బాషా మాట్లాడుతూ.. 2.96 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగులో ఉన్నాయని, 42.58 లక్షల టన్నుల దిగుబడి సాధిస్తున్నట్టు వివరించారు. డ్రిప్, స్ప్రింక్లర్ల పరికరాలను సబ్సిడీతో రైతులకు అందిస్తున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, ఉద్యానశాఖ డైరెక్టర్ యాస్మిన్ బాషా తదితరులు పాల్గొన్నారు.